Friday, August 27, 2010

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్

అతను టీ పోస్తాడు. రక్తం ధారపోస్తాడు. ఎలాగో తెలుసుకోండి...

ఒరిస్సా... కటక్ నగరం... బక్సీ బజార్. తెలతెలవారింది. అక్కడే ఉన్న ప్రకాశరావు టీ కొట్టు జనంతో కళకళలాడుతోంది. ఈ ఊళ్ళో మసాలా టీ అంటే ఎవరైనా ప్రకాశరావు కొట్టుకే రావాలి. సలసల కాగే టీ గ్లాసులు పట్టుకున్న జనంతో దుకాణం కళకళలాడుతున్నా... కాసులతో గల్లాపెట్టె గలగలమంటున్నా ఆ యజమానికింకా సంతృప్తి కలగలేదు. అంతలో ఒక ఫోనొచ్చింది. లుకేమియాతో బాధపడుతున్న ఏడేళ్ళ అబ్బాయికి రక్తం వెంటనే కావాలని దాని సారాంశం. "ఇదీ అసలైన పని" అంటూ రంగంలోకి దిగారు ప్రకాశరావు.

ప్రకాశరావుగారు తన ఫోనందుకుని మరో ఇద్దరికి ఫోన్ కొట్టారు. 15 నిమిషాల్లో ఇద్దరు కుర్రాళ్ళు అతని దగ్గరికొచ్చి అడ్రెస్ తీసుకుని రక్తం ఇవ్వడం కోసం రక్తనిధి (బ్లడ్ బ్యాంక్) కి వెళ్ళిపోయారు. ఆ కుర్రాళ్ళు ఎవరంటే... ప్రకాశరావు ఏర్పాటు చేసిన రక్తదాతల బృంద సభ్యులు. వీరిలో రకరకాల బ్లడ్ గ్రూపులున్న వ్యక్తులున్నారు. ప్రకాశరావు పిలుపు అందుకుని స్వచ్ఛందంగా ఈ బృందంలో చేరారు.

కటక్‌లోని ఎస్ సి బి వైద్యకళాశాల - ఆసుపత్రి (ఒరిస్సాలోని అతిపెద్ద వైద్య సంస్థ)కి వాళ్ళ వైద్యులకంటే ప్రకాశరావు చాలా ముఖ్యమైన వ్యక్తి. కనీసం ప్రతి 10 రోజులకొకమారు తన బృంద సభ్యుల ద్వారా రక్తమిప్పిస్తూ లెక్కకు మిక్కిలిగా రక్తం ధారపోసి వైద్యులకు, రోగులకు కావలసిన మనిషయ్యారు. తాను మాత్రమేగాక మరెందరినో రక్తదానం దిశగా ప్రేరేపించి, రకరకాల బ్లడ్ గ్రూపులున్న దాతల వివరాల్ని సేకరించి సేవ చేస్తున్న ప్రకాశరావును ఒక సంస్థగా చెప్పుకోవచ్చు.

అసలు ఇది ఎలా మొదలైందంటే... 1978లో ఒకసారి ప్రకాశరావు వెన్నెముకలో కణితి ఏర్పడినప్పుడు ఎస్ సి బి వైద్యకళాశాలలో చికిత్స పొందుతూ మూడు నెలలు అక్కడే ఉన్నారు. చికిత్సకు అవసరమైన రక్తం లేక చనిపోయేవారిని కళ్ళారా చూస్తూ... వారి బాధను తన బాధలా అనుభవించి ఇక తానుకూడా రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తర్వాత తాను కోలుకుని ఆ ఆసుపత్రి నుంచి బయటపడినప్పటికీ... రక్తదాతగా రోజూ అక్కడికెళ్ళి రోగులపాలిట రక్తదాతగా, ప్రాణదాతగా మారారాయన.

రక్తదానమొక్కటే ప్రకాశరావు వ్యాపకం కాదు. మురికివాడల చిన్నారుల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. టీ దుకాణం నుంచి ఆయనకు వచ్చే రోజువారీ ఆదాయం 500 రూపాయలు. అందులో 150 రూపాయలు ఈ పిల్లల చదువులు, అనాథలకోసం ఖర్చు చేస్తారు. ఈ సేవలో ప్రకాశరావు భార్యా పిల్లలు సైతం ఆయనకు చేదోడుగా ఉండటం తన జీవితంలోని మరో కొత్తకోణంగా ఆయన చెబుతారు.

టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్ అంటే... ఇదీ.

Monday, August 23, 2010

టవర్స్‌కు అందని ప్రేమ... లెవిస్‌పోర్ట్ ఆతిథ్యం

అమెరికాలో ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన భయానక ఉగ్రవాదదాడి జరిగిన సెప్టెంబర్ 11 (9/11) వ తేదీని మానవాళి ఏనాడు మర్చిపోలేదు. అయితే ఇదే రోజున అమెరికాలోని కొన్ని వేలమందికి "ప్రేమ"ను పంచి ఇచ్చిన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆ రోజున ఈ ఘోరం జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు అమెరికాలో దిగడానికి అనుమతివ్వలేదు. అమెరికాలో తిరుగుతున్న చాలా విమానాల్ని మధ్యలోనే ఎక్కడికక్కడ సమీప విమానాశ్రయాల్లో అప్పటికప్పుడే ప్రభుత్వం దింపించేసింది. ఈ క్రమంలో న్యూ ఫౌండ్‌లేండ్ వద్ద జేండర్ అనే చిన్న ఊరికి సమీపాన గల విమానాశ్రయంలో సుమారు 55 విమానాలు దిగి అక్కడే ఆగిపోయాయి. వాటన్నిటిలో కలిపి 10,500 మంది ప్రయాణీకులున్నారు. వీరంతా ఉన్నట్టుండి దిగిన జేండర్ గ్రామ ప్రజల సంఖ్య 10,400. ఆ ఉరి ప్రజల సంఖ్యకు సమానంగా ఉన్న విమాన ప్రయాణీకులకు తగినన్ని హొటళ్ళు, సదుపాయాలు ఆ ఊరిలో అంతగా లేవు. దాంతో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొందరు ప్రయాణీకుల్ని అక్కడికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెవిస్‌పోర్ట్ అనే మరో ఊరికి పంపారు.

ఈ అతిథుల కోసం లెవిస్‌పోర్ట్ గ్రామస్తులు స్కూళ్ళకు సెలవులిచ్చి, కమ్యూనిటీ హాళ్ళలో బస ఏర్పాటు చేశారు. విమానప్రయాణీకులందరిని సౌకర్యంగా ఉంచేందుకుగాను మంచాలు, స్లీపింగ్ బ్యాగ్స్, దిళ్ళు, దుప్పట్లు అందించారు. ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే ముసలివారు, గర్భవతులు, రోగులకు ఆసుపత్రికి సమీపంలోను, ఆడవారికి తోడుగా ఆడవారే ఉండేలా, కుటుంబ సభ్యులంతా ఒకచోటే ఉండేలా బస ఏర్పాటు చేశారు. వీరికోసం రాత్రివేళల్లోనూ బేకరీలు, హోటళ్ళు తెరిపించారు. స్కూళ్ళలో ఉన్నవారికోసం లెవిస్‌పోర్ట్ ప్రజలు స్వయంగా వంట చేసిపెట్టారు. ఈ ప్రయాణీకులు అక్కడెన్నాళ్ళుంటారో తెలియదు. అయినా విసుగుచెందక వారికి కాలక్షేపం కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతాలకు ఎక్స్‌కర్షన్స్, పడవ ప్రయాణాలు ఏర్పాటు చేశారు.

అతిథులు లాండ్రి మేట్‌లకు వెళ్ళి దుస్తులు ఉతుక్కోవడానికి ఉచితంగా టోకెన్లు ఇచ్చారు. వీరికి ఇబ్బందులు కలుగకుండా స్కూల్ స్టూడెంట్స్‌ని స్వచ్ఛంద సేవకులుగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందీ లేకుండా అన్నిరకాలుగా సాయం చేసారు. ఒక రెండుమూడు రోజులు గడిచాక విమానాలు ఒకొక్కటిగా వెళుతున్నాయి. ఏ ఒక్కరూ ఫ్లయిట్ మిస్ కాకుండా అందర్నీ జాగ్రత్తగా విమానాలు ఎక్కించారు.

ఇలా వెళుతున్న విమానాల్లో ఫ్రాంక్‌ఫర్ట్ విమానం ఒకటి. ఇందులోని ప్రయాణీకులంతా కలసి తమకు ఆతిథ్యమిచ్చిన లెవిస్‌పోర్ట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే డెల్టా 15 (తమ విమానం నెంబర్) ట్రస్ట్ పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. తాము బస చేసిన స్కూలు విద్యార్థులు కాలేజీలో చేరడానికి వీలుగా స్కాలర్‌షిప్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఈ ప్రతిపాదన చేసిన ఒక ప్రయాణీకుని కంపెనీ మరి కొంత మొత్తం సాయం చేసింది. ఈ సంగతి తెలిసిన డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇంకొంత మొత్తం చేర్చింది. ఈ చక్కని ఆలోచన గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న మిగిలిన విమానాల్లోని ప్రయాణీకులు తమ వంతుగా డబ్బు పంపారు. దీంతో ఒక పెద్ద ఫండ్ ఏర్పడి లెవిస్‌పోర్ట్ విద్యార్థులకు సాయం అందుతోంది. నేటికీ ఆనాటి విమాన ప్రయాణీకులు వారి పుట్టినరోజు, పెళ్ళిరోజుల్లో ఈ ఫండ్‌కు డబ్బు పంపుతూ చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో కొత్తకోణాల్ని పూయిస్తున్నారు. కూలిన ట్విన్ టవర్స్ కంటే ఎత్తయిన కట్టడాలు ప్రపంచంలో ఎన్నో ఉండవచ్చుగాక... వాటన్నిటికీ అంతనంత ఎత్తయింది తమ ప్రేమ అని ఇరువురూ చాటారు.

సౌజన్యం: శ్రీ మల్లాదిగారు.