Wednesday, March 29, 2006

ఎనిమిదే చదివింది ... దేశాలు తిరిగింది

మొక్కవోని దీక్షతో చేసిన స్వయంకృషే కస్తూరికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం వచ్చేలా చేసింది. తమిళనాడులోని మదురై జిల్లా పెరుంగుడికి చెందిన ఈమె చదువు కేవలం 8వ తరగతి మాత్రమే. భర్త ఆటో డ్రైవర్ కాగా, నలుగురు పిల్లలతో కూడిన కుటుంబం ఆమెది. సిసిడి (కోనేనంట్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్) ద్వారా ప్రారంభమైన మహిళా స్వయం సహాయక బృందం సభ్యురాలిగా కస్తూరి ఉత్సాహంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. వివిధ సమస్యలపై సిసిడి నిర్వహించే సమావేశాల్లోని ప్రతి విషయాన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసి, చివరకు ఈ సమావేశాలకు ఆమె ప్రధాన వక్తగా మారారు. తన చొరవ, ఉత్సాహంతో ఎనిమిది జిల్లాల మహిళా స్వయం సహాయక బృందాలకు నాయకురాలయ్యారు. సమావేశాల ద్వారా వివిధ బృందాల స్త్రీల కష్టనష్టాలను పరిశీలించి వారి ఆదాయంలో అధిక మొత్తం వైద్యానికే సరిపోతోందని కస్తూరి గ్రహించి ఓ పరిష్కారం కోసం నడుం బిగించారు. వైద్యానికి ఉపకరించే వనమూలికల పెంపకం దిశగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారీమె. ఇప్పుడు ఈ ఉద్యమం సుమారు 125 గ్రామాలకు విస్తరించింది. అంతటితో ఆగక సునామీ బాధిత ప్రాంతమైన నాగపట్టణం జిల్లాలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి నిరాశ్రయులెందరికో పునరావాసం కల్పించారు. కస్తూరి కృషి, పట్టుదల గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి అధికారులు పంపిన ఆహ్వానంపై ఆమె దక్షణాఫ్రికాలో వనమూలికల పెంపకంపై జరిగిన సదస్సుకు హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత సునామీ సహాయక చర్యలు - పునరావాసం అంశంపై న్యూయార్క్, వాషింగ్టన్, బాంగ్లాదేశ్‌లలోనూ అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ఎందరో తమ జీవితాల్లోని కొత్త కోణాలను స్పృశించేందుకు కస్తూరి జీవితం తప్పక స్ఫూర్తినిస్తుంది.

Tuesday, March 28, 2006

ఉద్యోగం చిన్నదే.... హృదయం పెద్దది

ఈయన రాజకీయ నాయకుడో, వ్యాపారవేత్తో లేదా పారిశ్రామిక వేత్తో కాదు. కడప జిల్లాలోని పులివెందుల ఫైర్ స్టేషన్ డ్రైవర్ నారాయణ జీవితం ఇది. ప్రతినెలా తన జీతంలోంచి కనీసం 500 రూపాయలను సమాజసేవకే వినియోగిస్తారు. తాను పనిచేస్తున్న ఫైర్ స్టేషన్ ఆవరణలో రూ.35 వేల ఖర్చుతో నీటి ట్యాంక్ ఏర్పాటు చేయడమేగాక ఫైరింజన్‌కు 2 వేల రూపాయల ఖర్చుతో రంగు వేయించారు. ప్రభుత్వ ఖర్చుతో జరగాల్సిన ఎన్నో మంచి పనులకు తన సొంత డబ్బును ఖర్చు చేసారు. తన కార్యాలయానికే గాక సమీపాన గల గాంధీనగర్ పాఠశాలకు నారాయణ అందించిన తోడ్పాటు అంతా ఇంతా కాదు. ఈ పాఠశాలకు బీరువా, జెండా దిమ్మె, క్రీడా పరికరాలు, ప్లాస్టిక్ నీటి ట్యాంకు, గడియారం ఇంకా ఎన్నెన్నో నారాయణ జీతంలోంచి సమకూరాయి. ఇంతేగాక ఈ ఊరిలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో నారాయణ అందించిన గడియారాలు అతని సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తాయి. అవి మోగించే ఘంటికలు జీవితకాలపు విలువను చెప్పకనే చెబుతుంటాయి. పదవీ విరమణాతరం తనకు వచ్చే పింఛను మొత్తాన్ని సేవాశ్రమ నిర్మాణానికి ఉపయోగించాలన్నది నారాయణ లక్ష్యం.

Monday, March 27, 2006

బధిరులు నడిపే భోజనశాల

వివేక్ కొఠారి.... పుట్టుమూగ, చెవుడు. ఈ వైకల్యం కారణంగా ఒకప్పుడు హేళనలకు కూడా గురైయ్యాడు. తీవ్రమైన శారీరక సమస్యలున్నా అమెరికా వెళ్లి పై చదువులు కూడా చదువుకున్నాడు. ఇప్పుడితని స్థాయి ఏంటో తెలుసా? జైపూర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంపై విజయవంతంగా నడుస్తున్న రివాల్వింగ్ రెస్టారెంట్‌కు యజమాని. ఈ హోటల్ ఏర్పాటులో పలు ఆటంకాలెదురు కాగా న్యాయపోరాటాలు చేసి మరీ అనుకున్నది సాధించాడు. మరో విశేషమేమంటే... ఇతని సిబ్బందిలో పాతిక శాతం మంది బధిరులేనట. తద్వారా తనలాంటి వికలాంగులకు అండగా నిలుస్తున్నాడు. జైపూర్ వెళ్లేవారికి ఈ హోటల్ కూడా ఓ పర్యాటక స్థలమే.

Friday, March 24, 2006

సమైక్యత కోసం ఆసనాలు

దేశ సమైక్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించడానికి తన వంతు ఏం చేస్తే బాగుంటుంది ? మద్రాసు సమీపానగల పట్టాభిరాంలోని భారతీనగర్‌కు చెందిన సిద్ధ వైద్యులు, యోగాసనాల నిపుణులైన అన్బరసన్‌కు వచ్చిన ఆలోచన ఇది. తనకు తెలిసిన విద్యనే ఇందుకు సాధనంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన జాతీయ పతాకాలను చేబూని, తలపై కూడా పతాకాన్ని ధరించి, వినూత్న రీతిలో అనేక రకాల అసనాలు వేసి జాతి సమైక్యత దిశగా జనావళిని ప్రేరేపించేందుకు పతాకస్థాయిలో ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇదొక్కటే కాదు ఏటా స్వాతంత్ర్య దినమైన ఆగష్టు 15వ తేదీన కూడా దేశ శాంతిని కోరుతూ ఇలాంటి భిన్నమైన కార్యక్రమాలను అన్బరసన్ నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లకు పైగా ఆయన శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తూ విశిష్ట రీతిలో దేశమాతకు సేవలందిస్తున్నారు. ఇదీ ఆయన జీవితంలోని సరికొత్త కోణం.

Thursday, March 23, 2006

వీళ్ల ముందు మా సేవలెంత...

పై మాటలన్నది ఆ జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవండి. వాళ్ల ముగ్గురు పిల్లలతో పాటు ఇంటికొచ్చిన ఏడుగురు బంధువుల్నీ సునామీ రూపంలో ఎగసిన సముద్రం మింగేసింది. అదికూడా ఆ ఇంటి పెద్ద పుట్టిన రోజున. తమిళనాట నాగపట్టణంలో ఓఎన్‌జీసీ ఉద్యోగి పరమేశ్వరన్, అక్కడే పనిచేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగిని చూడామణి దంపతుల వ్యధాభరిత కథ ఇది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఏం చేసారో తెలుసా? దైన్యంతో మూల కూర్చోలేదు. ధైర్యంగా ముందడుగేసి తమలాంటి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లా వరకూ ప్రయాణించి తమలాంటి బాధితులకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసారు. అంతటితో ఆగలేదు. నంబిక్కై (నమ్మకం) పేరిట సేవా సంస్థను ప్రారంభించారు. సునామీ విలయతాండవంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలను చేరదీసి, వారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ వసుధైక కుటుంబానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ దంపతులను కలుసుకొని ఈ కథలాంటి ఈ నిజాన్ని ప్రతి చోటా చెబుతానన్నారు.

అతను అన్నీ చేయగలడు...

అతను టీ కప్‌ను భుజంపై పెట్టుకొని తాగుతాడు. స్క్రూడ్రైవర్ పట్టుకొని రేడియో, టీవీ, సెల్‌ఫోన్... ఇలా ఏది పాడైనా బాగుచేస్తాడు. ఖాతాదార్లు కూడా ఎక్కువమందే. చూట్టానికి ముచ్చటేస్తుంది కూడా. ఇవి కాకుండా స్విచ్ వేస్తాడు, పుస్తకాలూ పట్టుకోగలడు. మొదట చెప్పిన విషయం తప్ప మిగిలినవి చాలామంది చేసేవేగా, కొత్తేముంది అంటారేమో.... ఆగండాగండి. ఇవన్నీ అతను కాళ్లతో లేదా నోటితోనే చేస్తాడు. ఎందుకంటే అతనికి పుట్టుకతోనే చేతుల్లేవు. చెన్నై సమీపాన గల విల్లివాక్కం ప్రాంతానికి చెందిన హాసిన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. చేతుల్లేవన్న నిజం మొదట బాధ కల్గించినా, తల్లిదండ్రుల చేయూతతో చాలా పనులు కాళ్లతో లేదా నోటితోనే చేసుకోవడం నేర్చుకున్నాడు హాసిన్. అంతటితో హాసిన్ తన జీవితాన్ని సరిపెట్టుకోలేదు. తన మిత్రులు స్థాపించిన జీవన్ వెల్ఫేర్ సొసైటీ తరపున పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఎయిడ్స్ వ్యాధిపై సమాజానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. పదో తరగతే చదువుకున్నా హాసిన్ పది మందికీ ఎలా ఉపయోగపడుతూ జీవితంలోని కొత్త కోణాల్ని ఆస్వాదిస్తున్నాడో తెలుసుకున్నారుగా....

Wednesday, March 22, 2006

భర్త వీరమరణం...భార్య సైన్యం వైపు

పెళ్లయిన 19 నెలలకే శ్యామలి ఆర్య భర్త, సైనికుడైన కెప్టెన్ సంజయ్ ఆర్య సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో మరణించారు. అప్పటికి నెలల పసికందు శ్యామలి ఒడిలో ఉంది. ఇదే పరిస్థితిలో మరో ఆడబిడ్డ ఉంటే వారు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉండేవారు ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ, శ్యామలి ఇప్పుడెలా ఉందో తెలుసా ? మాతృదేశ రక్షణకోసం ప్రాణాలు విడిచిన భర్త అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నారు. కఠోర దీక్షతో కృషిచేసి చెన్నై పరంగిమలైలో ఉన్న భారత సైనిక విభాగం నిర్వహించిన సైనిక ప్రవేశ పరీక్షలో విజయం సాధించారు. ఏ సైన్యంలో పని చేస్తూ తన భర్త ప్రాణ త్యాగం చేసారో అదే సైన్యంలో లెఫ్ట్‌నెంట్ స్థాయి సైనికాధికారి పదవికి శ్యామలి చేరువై తన జీవితంలోనే కొత్త కోణాన్ని వీక్షించారు. శ్యామలి జీవితం మన దేశంలో ప్రతి ఒక్కరికీ పాఠమే.

రియల్ సన్... నెల్సన్

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన 24 ఏళ్ల వికలాంగుడు నెల్సన్‌కు మూడు చక్రాల సైకిలే ఆధారం. క్షణకాలపు ఆవేశంతో దేశంలో ఎందరో ఎయిడ్స్ బారిన పడి జీవనాధారాన్ని కోల్పోతున్నారన్న నిజం అతన్ని ఊరకే ఉండనివ్వలేదు. వెంటనే తన మూడు చక్రాల సైకిల్‌నే ప్రచార రథంగా మార్చుకొని ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పర్యటన ప్రారంభించాడు. సుమారు 160 రోజులుగా దాదాపు 1600 కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో పర్యటించి ఎందరో గ్రామీణ ప్రజలకు, అక్కడి పాఠశాల విద్యార్ధులకు ఎయిడ్స్ భూతం గురించి చెప్పి హెచ్చరించాడు. ముఖ్యంగా డ్రైవర్లకు ఈ వ్యాధి పట్ల అవగాహన లేక ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారని తెలుసుకున్న నెల్సన్ వారిని ప్రధాన లక్ష్యంగా చేసుకొని విస్తృత ప్రచారం చేసాడు. ఇతని పట్టుదలకు మెచ్చుకున్న తమిళనాడు ఎయిడ్స్ నివారణ సంస్థ తగినంత చేయూతనిస్తోంది. ఈ ప్రచారంతో పలు జీవితాలను తీర్చిదిద్ది కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు మన నెల్సన్.

వైకల్యమున్నా.... ఆటల్లో మేటి

చెన్నై సమీపాన అరక్కోణానికి చెందిన అరవిందరాజ్ నిజంగా హీరోనే. ఇతని కథేంటో తెలుసా ? తొమ్మిది నెలల వయసుకే పోలియో రావడంతో రెండు కాళ్లూ వైకల్యానికి గురయ్యాయి. ఆ వైకల్యాన్నే ఆయుధంగా మార్చుకొని అరవిందరాజ్ సాధించిన విజయాల పరంపర, ఇతని జీవితంలోని కొత్త కోణాల గురించి తెలుసుకోండి మరి. 1998, 2000 సంవత్సరాల్లో జరిగిన టేబిల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేత ఇతనే. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహేబిలిటేషన్ చెన్నైలో నిర్వహించిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2002 సంవత్సరంలో బెంగళూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్ పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో స్వర్ణాలు, జావెలిన్‌త్రో విభాగంలో రజతాన్నీ కైవశం చేసుకున్నాడు. ఆ తర్వాత 2004, 2006 సంవత్సరాల్లో బెంగళూరులోనే జరిగిన జాతీయ వికలాంగుల క్రీడల్లోనూ పాల్గొని టేబుల్ టెన్నిస్, వీల్ ఛైర్ బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం అరక్కోణంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ టేబుల్ టెన్నిస్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవిందరాజ్ గతంలో కొరియాలో జరిగిన భూసన్ ఫెస్పిక్ గేమ్స్, చైనాలో జరిగిన నాలుగో ఫెస్పిక్ గేమ్స్‌కు అర్హత సాధించినా ఆర్థిక సమస్యల కారణంగా వెళ్లలేకపోయాడు. ఇప్పుడు మలేసియాలో జరిగే ఏసియన్ గేమ్స్‌లో పాల్గోనేందుకు అర్హత సాధించి సాయమందించే దాతల కోసం ఎదురు చూస్తూ ముందడుగేస్తున్నాడు.

నిన్న వెట్టిచాకిరీ...నేడు బాలల ప్రతినిధి

బీహార్‌లోని పరాసావన్‌కు చెందిన పేద ముస్లిం బిడ్డ గురియా ఖాతూన్. రెండేళ్ల కిందట నిరక్షరాశ్యురాలు, తొమ్మిదేళ్ల వయసుకే భూస్వాముల ఇంట వెట్టిచాకిరీ. ఇదీ ఆమె నేపథ్యం. మరిప్పుడో... బడికెళ్లని బాలల చేత పుస్తకాలు పట్టించే యునిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ విభాగం) కార్యక్రమంలో భూమికను నిర్వహించాలంటూ ఆహ్వానం అందుకుంది. లండన్‌లో జరిగిన యునిసెఫ్ ప్రపంచ బాలల స్థితిగతుల నివేదిక విడుదల కార్యక్రమానికి భారత బాలల తరపు ప్రతినిధిగా పాల్గొంది. నేడు తోటి ముస్లిం బాలికలకు చదువు చెబుతూ కరాటే కూడా నేర్పుతోంది. చదువులోని ఆనందాన్ని ఆస్వాదించాలనే గురియా తపనే ఆమెకు ఈ హోదానిచ్చింది. గతంలో ఆమె పరిస్థితేంటో తెలుసా ? చదువు పేరెత్తితే తంతామని ఇంట్లో హెచ్చరికలు. మరోవైపు ఈడొచ్చిందని పెళ్ల ప్రయత్నాలు. ఎలాగో అమ్మ దగ్గర ఏడిస్తే మదరసాకు మాత్రం పంపారు. అక్కడ గురియా ఖురాన్ పఠనం, ఉర్దూ రాయడం నేర్చుకుంది. అదే సమయంలో ప్రభుత్వ విద్యాశాఖ నేతృత్వంలో నడిచే మహిళా సమాఖ్య నడిపే బడి గురించి గురియా తెలుసుకొని వెళ్లి చూసింది. చదువుపై మక్కువ ఎక్కువైంది. అప్పుడే మహిళా సమాఖ్య కార్యకర్త గురియాకు పరిచయమై ఆమె ఇంటికెళ్లి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసింది. చివరకు గురియా పిన్ని చొరవతో ఆమె మార్గం సుగమమైంది. గురియా ఎంచుకున్న చదువు మార్గమే నేడు ఆమె పాలిటి స్వర్గం కదూ... ఇదీ ఆమె జీవితంలో కొత్త కోణం.

Tuesday, March 21, 2006

రోగిగా వచ్చింది... తోడై నిలిచింది

ఆమె ఎవరికీ చుట్టం కాదు. కానీ క్షణం పాటు కనిపించకపోతే చాలు అల్లాడిపోతారు. మనం చెప్పుకుంటోంది పులివెందుల ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించే రంగలక్ష్ముమ్మ గురించి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపాన లింగారెడ్డిపల్లె వాసి అయిన ఈమె ఆయాసంతో బాధపడుతూ చికిత్స కోసం 6 నెలల కిందట ఈ ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యవంతురాలైంది. అయితే, ఇదే ఆసుపత్రిలో పలుకరించే దిక్కులేక, సాయం చేసే తోడులేక అవేదనతో కుమిలిపోతున్న మహిళలు, వృద్ధులైన రోగులు చాలామందిని రంగలక్ష్ముమ్మ చూసింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి, నాటి నుంచీ అక్కడి రోగులపాలిటి ఆత్మబంధువుగా మారిపోయింది. బాధపడుతున్న వారిని ఊరడిస్తూ, కబుర్లు చెప్పి నిద్రపుచ్చుతుంది. ఎవరికేం కావాలన్నా బజారుకెళ్లి అన్నీ తెచ్చిపెడుతుంది. రోగుల మధ్య ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుందని అక్కడ పనిచేసేవారు అంటే .... నన్ను చూసుకోవడానికి మీరున్నారుగా అంటూ నవ్వేస్తుంది. తోటివారికి సాయపడటానికి ఆర్థిక స్థోమతే ఉండాల్సిన అవసరం లేదని, ఆదరించే మనసుంటే చాలనేది రంగలక్ష్ముమ్మ అందరికీ చెప్పేమాట. ముసలి వయసులో తనకు తోడులేదన్న దిగులును విడిచిపెట్టి, తోటివారినే తనవారిగా భావించి సాయంచేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న రంగలక్ష్ముమ్మ అందరికీ ఆదర్శం కదూ.

Sunday, March 19, 2006

వికలాంగులా మజాకా

వికలాంగులే జ్యోతి ప్రజ్వలన గావించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అన్నీ ఉన్న సమాజానికి తమ విజయగాథలను వినిపించి స్ఫూర్తినిచ్చిన అద్భుత కార్యక్రమం అది. నోటితో చిత్రాలు గీసే జనార్థన్, డ్రమ్స్ వాయించడంలో ఘనుడైన కేఆర్ ప్రసాద్, తమిళ సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న తొలి అంధుడు ఆర్.చంద్రన్... ఇలా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన వికలాంగులెందరో చెన్నై శివారు రెడ్‌హిల్స్ తిరువళ్లూర్ కూడలి వద్దగల శీనయ్యర్ నాడార్ రాజమ్మాళ్ల్ కళ్యాణ మండపానికి విచ్చేసి తమ సత్తా చాటారు. చెన్నై సమీపానగల పాడియనల్లూరులోని మదర్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్, అంగవికలురకు చేయూతనిస్తూ ఆదుకుంటున్న సెల్వకూమార్ ఈ విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి. వివిధ రంగాల్లో ప్రవీణులైన వికలాంగులను సత్కరించారు. విజయాలు సాధించడానికి అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డుకాదని చాటే "ఇదుదాన్ ఆరంభం (ఇదే ఆరంభం)" అనే చలనచిత్రం చిత్రీకరణ ఈ సందర్భంగా ప్రారంభమైంది.

Friday, March 17, 2006

నిన్న బెదిరినా... నేడు అదరగొడుతోంది

చెన్నైశివారు ప్రాంతమైన అలమాదికి చెందిన సంగీత అందరిలాంటి మామూలు ఆడపిల్ల. తండ్రి నటరాజన్ ఓ మామూలు ఉపాధ్యాయుడు. సంగీత రోజూ పాఠశాల నుంచి ఇంటికొస్తూంటే తన వెంటపడే అల్లరిమూకల వేధింపులకు ప్రతిరాత్రీ బాధపడేది. వెంటనే దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఇంటిదగ్గరుండే స్నేహితుని సాయంతో ఓ రోజు కరాటే తరగతుల్లో చేరింది. ఇప్పుడామె సాధించిన విజయాలేంటో తెలుసా ? ధర్మపురిలో జరిగిన దక్షిణభారత కరాటేపోటీల్లోను, చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో ప్రథమస్థానం దక్కించుకుంది. అలా సాగిన జైత్రయాత్ర ఆమెకు ఇంకెన్నో గౌరవాలను అందించింది. ఇప్పుడు తన ఇంటివద్ద సుమారు 150 మందికి కరాటే శిక్షణనిస్తున్నారు. ఈమె శిష్యుల్లో 70 మంది గృహిణులు కూడా ఉన్నారు తెలుసా. అమ్మాయిలూ.... సంగీతను స్ఫూర్తిగా తీసుకొని సంగీతంతో పాటు యుద్ధ కళల్ని కూడా నేర్చుకోండి మరి.

Thursday, March 16, 2006

అంధుడు కాదు జ్ఞానపుత్రుడు

మెదక్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన గంగారాం మూడో ఏటే మశూచి బారినపడ్డారు. నాటి నుంచీ అంధత్వంతోనే ఆయన బంధుత్వం నెరిపి, దృష్టిలేమినే ఆయుధంగా మలుచుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా తెలుగులో ఎం.ఎ పట్టా సాధించడమేగాక, పరిశోధన పత్రం సమర్పించి ఎం.ఫిల్ పట్టా కూడా దక్కించుకున్న తొలి అంధుడు గంగారాం. రాష్ట్ర ప్రభుత్వం అంధులకు ఇచ్చే అత్యుత్తమ సేవా పురస్కార గౌరవాన్ని పొందారు. ఇప్పుడు అంధుల పాఠ్యపుస్తకాలను ముద్రించే సంస్థలో గంగారాం సేవలందిస్తూ ఎందరికో సాయం చేస్తున్నారు. మన గంగారాం బంగారం కదూ.

పరీక్షలో విజేత 82 ఏళ్ల బామ్మ

మలేసియాలోని సిక్కు కుటుంబంలో పుట్టిన 82 ఏళ్ల మొహిందర్ కౌర్‌కు 11 మంది మనుమలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. వారితో ఆటపాటలను కొనసాగిస్తూనే నవంబర్ 2005లో మలేసియా దేశవ్యాప్తంగా జరిగిన పంజాబీ పరీక్షకు హాజరై ప్రధమస్థానం పొందారు. గత 30 ఏళ్లుగా ఆమె అక్కడి పాఠశాలల్లో పంజాబీ ఉపాధ్యాయురాలిగా పని చేసారు. అయితే, ఈవిడ ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలవడంలో గొప్పేముందని అనుకోవచ్చు. ఇక్కడి విషయం అది కాదు. బాధ్యతలన్నీ ముగిశాక ఊసుబోలు కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఏదో ఒకటి సాధించాలన్న తపనతో ఆమె ముందడుగేసింది. ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచి జీవితంలోని ఓ కొత్తకోణాన్ని ఆస్వాదించింది. వయసు కాదు, కృషి ముఖ్యమని చాటింది.

పేదవాడి పట్టుదలతో తెరుచుకున్న గేట్

కడప కేఎస్సారెమ్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విద్యార్థి ఆర్.ప్రసాద్. తిరుపతి బొమ్మగుంట వీధిలో ఉంటున్న అతని తండ్రి శివాజీ ఒక ప్రయివేటు ఎలక్ట్రీషియన్, తల్లి స్వర్ణ మహిళా సంఘంలో సభ్యురాలు. సంఘంలో అమ్మ చేసే అప్పులే ప్రసాద్ చదువుకు పెట్టుబడి. ఆ పెట్టుబడినే పట్టుదలగా మార్చుకున్నాడు ప్రసాద్. కష్టపడి చదువుకొని గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షలో వెయ్యికి 758 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందాడు. ఈ వార్తను నేను ఈనాడు పత్రికలో చదివాను. ప్రసాద్‌ను మన విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందడుగేయాలి.

ఇంటికీ, బస్సుకూ ఆమే డ్రైవర్

నిత్యం రద్దీతో ఉండే చెన్నైలోని వడపళని, పట్టినబాకం ప్రాంతాలను కలిపే మార్గం అది. ఆ దారిలో రోజూ వెళ్లే 12బి నెంబరు బస్ డ్రైవర్ (ఈ కథనం రాసే నాటికి) హమీదాబాను జీవితం మహిళా లోకానికి స్ఫూర్తి అనడం అతిశయోక్తి కాదేమో. చెన్నై సిటీబస్సుల నిర్వహణ సంస్థ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (ఎమ్‌టిసి)లో స్థానం దక్కించుకున్న తొలి మహిళా డ్రైవర్ ఆమె. బస్సుతో పాటు ఇల్లాలుగా ఇంటినీ నడిపే హమీదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినా, ఆ స్థాయి ఉద్యోగమే కావాలని కూర్చోలేదు. విరామ సమయంలో లారీలు, బస్సుల మరమ్మతు విధానాలను నేర్చుకొని అందులో నిష్ణాతురాలయ్యారు. ముందు తాను చదివిన కారైకుడి (తమిళనాడు)లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ బస్సు డ్రైవరుగా విధులు నిర్వహించారు. విరామ సమయాల్లో టెక్నికల్ డ్రైవింగ్ తరగతులు నిర్వహిస్తూ యువతులకు ఆటో డ్రైవింగు నేర్పి తోటి మహిళలకు హమీదా ఆదర్శంగా నిలిచారు. డ్రైవర్ సీట్లో హమీదా ఉంటే ఇక భయమేలేదని ఆమె బస్సులోని ప్రయాణీకులు, సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి.

మడతపడిన సైకిల్...

తమిళనాడులోని కడలూర్ జిల్లా తెన్‌పాది గ్రామం.... అక్కడ చింతామణి అనే ఓ 80 (ఎనభయ్యే...) ఏళ్ల కుర్రాడు విరిగిన సైకిల్‌తో కనిపిస్తుంటాడు. కావలసినప్పుడు దాన్ని అతికించుకుని తొక్కుకుంటూ వెళిపోతుంటాడు. ఆ కుర్రాణ్ణి ఓసారి పలకరిస్తే... ఈ సైకిల్ కథ చెప్పాడు. అక్కర్లేనప్పుడు మడతపెట్టుకొని... అవసరమైనప్పుడు అమర్చుకొనే వీలుగల ఈ సైకిల్ దాదాపు 50 ఏళ్ల కంటే పాతదట. అప్పట్లో బ్రిటిష్ సైనికులు ఇలాంటి మడిచే సైకిళ్లను వేసుకొని హెలికాఫ్టర్‌లో ఆయా ప్రాంతాలకు చేరుకొనేవారట. హెలికాఫ్టర్లు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు ఈ సైకిళ్లపై వెళ్లి విధులు నిర్వహించేవారట. అలాంటి ఓ సైకిల్‌ను మన చింతామణిగారు సంపాదించి... నాటి నుంచి నేటి వరకూ దాన్నే ఉపయోగిస్తున్నారు. తిరుపతి, పళని, వేలాంగన్ని (క్రైస్తవ పుణ్యక్షేత్రం) వంటి ప్రముఖ క్షేత్రాలకు ఈ సైకిల్ పైనే వెళుతుంటారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యం బాగుంటుందని, దీనితో పాటు కాలుష్యానికి దూరంగా ఉంటూ జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించవచ్చనేది పదవీ విరమణ చేసిన ఈ ఉపాధ్యాయుని ఉవాచ.

Wednesday, March 15, 2006

సంచార దుకాణం - స్థిరమైన జీవితం

అతను ఎం.ఎ పట్టభద్రుడు. మొన్నటి నిరుపేద, నిన్నటి నిరుద్యోగి. నేడు.... నలుగురికి ఉపాధినిచ్చే యజమాని స్థాయి. అతనే పాండిచ్చేరికి చెందిన నెడుంజెళియన్. ఇదంతా ఎలా జరిగిందటారా ? అందరిలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నించినవాడే. ఒక దశలో పాండిచ్చేరిలోని జిప్‌మెర్ ఆసుపత్రిలో వెల్డింగ్ కార్మికుడిగానూ తాత్కాలికంగా పని చేసాడు. బతుకు బండి సరిగ్గా నడవకపోవడంతో ఇల్లు తాకట్టుపెట్టి ఈ ఆసుపత్రి దగ్గరే ఒక బడ్డీకొట్టు పెట్టుకొని ఖాళీ సమయాల్లో దానినీ చూసుకుంటూ రేయింబవళ్లూ కష్టపడ్డాడు. పరిస్థితి మెరుగుపడటంలో అప్పుతీర్చి ఇంటిని తాకట్టు నుంచి విడిపించుకున్నాడు. తర్వాత సంచార దుకాణం నడిపితే ఎలాగుంటుందనే కొత్త ఆలోచనతో మారుతీవ్యాను కొనుక్కొని ఆసుపత్రి పరిసరాల్లో దానిని సంచార దుకాణంగా నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అతని స్థితి ఏమిటో తెలుసా ? మరో కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఇంకో సంచార దుకాణం పెట్టుకున్నాడు. మరిందరికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాడు. ఉద్యోగం దొరకకపోతే దానికోసం చెప్పులరిగేలా తిరిగి సమయాన్ని వృధా చేసేకన్నా, కొంచెం కష్టపడేందుకు నేటి యువత ముందడుగేస్తే జీవితంలో హాయిగా స్థిరపడవచ్చని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు నెడుంజెళియన్.

నిన్న కూలీ .... నేడు అదర్శనారి

నాగ శిరోమణి చదివింది 5వ తరగతే. అయినా పనిలో మణిపూసే. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మొన్న వ్యవసాయకూలీగా, నిన్న డ్వాక్రా మహిళగా ఎదిగి మదర్ థెరిసా సొసైటీకి నేతృత్వం వహించారు. విధి నిర్వహణలో చూపిన పట్టుదలతో అధికారుల దృష్టిలో పడి జాతీయ సమాచార సంస్థ ద్వారా కంప్యూటర్ శిక్షణనందుకున్నారు. రాయితీతో కూడిన రుణం పొంది, తన ఊరిలో సొసైటీ బృందం అండగా ఈ-సేవ కేంద్రాన్ని తెరిచి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరి నేడో.... అంతర్జాతీయ సంస్థ స్కాచ్ ఛాలెంజర్ ఇచ్చే గ్రాస్ రూట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి చేరువయ్యారు. మన మహిళా లోకానికి ఈమె స్ఫూర్తిదాయకం కదూ...

నేల మీద కాగితం .... కాలితో కలం

ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలోని అటవీప్రాంత గ్రామమైన కుమ్మరిగూడెం వాసి పర్శిక రాజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి (ఈ కథనం రాసే నాటికి). చిన్నతనంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులూ పోయాయి. రోజూ అడవిమార్గంలో నడచి మణుగూరులోని జూనియర్ కళాశాలలో జరిగే తరగతులకు వస్తుంటాడు. మరి పాఠ్యాంశాలు ఎలా రాసుకుంటాడనేగా మీ సందేహం ? విజేతకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి. పట్టుదలను కలగలిపి కాలితోనే కలం పట్టి రాయడం నేర్చుకున్నాడు. చక్కని దస్తూరిని అలవరుచుకున్నాడు. ఉజ్వల భవిత దిశగా అడుగులేస్తుంటాడు.

ఈ అపరిచితులు మనవాళ్ళే...

జీవకోటి పట్ల ప్రేమానురాగాలు కలిగి విశ్వకళ్యాణం దిశగా ఏదైనా చెయ్యాలన్న తపనకు తగినంత కృషి తోడైతే చాలు, బీద, గొప్ప అనే తారతమ్యం లేకుండా జీవితాన్ని అర్థవంతంగా, స్ఫూర్తి దాయకంగా తీర్చిదిద్దుకోవచ్చు. విజయాల బాటలో పయనించవచ్చు. అలాంటి ప్రయత్నాలు చేసి ఆదర్శవంతంగా నిలిచినవారెందరో మనతోనే ఉన్నారు. వివిధ పత్రికల్లో లభించిన వివరాలు, నేను వ్యక్తిగతంగాను, మిత్రుల సాయంతో సేకరించిన సమాచారం మేరకు, అటువంటి ఆదర్శమూర్తులు వీలైనంత ఎక్కవమంది గురించి విస్తృతంగా అందరికీ తెలియాలన్న కోరికతో ఈ బ్లాగ్ ప్రారంభించాను. ఇందులో ఎప్పుడో జరిగి ఇప్పుడే నా దృష్టికి వచ్చిన విషయాలు కూడా ఉంటాయి. నేను 12 ఏళ్ళకు పైగా తమిళనాడులో ఉన్నందున అక్కడ సంభవించిన వాస్తవ ఘటనలు, నిజ జీవిత సంఘటనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. లేమిని చూచి భయపడుతూ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే వారిలో కొందరైనా లేదా ఒక్కరైనా ఇక్కడి నుంచి స్ఫూర్తి పొంది ఒక్కడుగు ముందుకేసినా చాలు, నా ప్రయత్నం ఫలించినట్లే.....